బేబీకార్న్‌ పులావ్‌

కావలసిన పదార్థాలు :-
బాస్మతి బియ్యం - ఒక కప్పు,
బేబీకార్న్‌లు - పన్నెండు,
ఉల్లిపాయ - ఒకటి,
కొబ్బరి పాలు (పలుచగా) - రెండు కప్పులు,
బిర్యానీ ఆకు - ఒకటి,
పసుపు - చిటికెడు,
దాల్చిన చెక్క - చిన్న ముక్క,
లవంగాలు - మూడు,
యాలక్కాయలు - రెండు,
ఉప్పు - సరిపడా,
నూనె లేదా నెయ్యి - మూడు టేబుల్‌ స్పూన్లు.
గుజ్జు కోసం:-
కొత్తిమీర కట్టలు - రెండు,
వెల్లుల్లి (చిన్నవి) - ఐదు,
అల్లం - చిన్న ముక్క,
కొబ్బరి తురుము - రెండు టేబుల్‌ స్పూన్లు,
పచ్చిమిర్చి - నాలుగు,
గరం మసాలా పొడి - పావు టీస్పూన్‌.
తయారీ విధానం:-
బియ్యాన్ని కనీసం అర గంట నానపెట్టాలి.
ఉల్లిపాయని నిలువు ముక్కలుగా కోసుకోవాలి.
బేబీకార్న్‌ను కుక్కర్‌లో మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.
ఒకవేళ బేబీకార్న్‌ను పలుచగా గుండ్రటి ముక్కలుగా కోసుకుంటే కనుక కుక్కర్‌లో ఉడికించాల్సిన అవసరం లేదు.
గుజ్జుకోసం కావాల్సిన పదార్ధాలన్నింటినీ మిక్సీలో తక్కువ నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
పులావ్‌ను కుక్కర్‌లో నేరుగా వండుతుంటే కనుక అందులోనే నూనె వేడిచేసి బిర్యానీఆకు, దాల్చినచెక్క, యాలక్కాయ, లవంగాలను వేసి వేగించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగించి బేబీకార్న్‌, రుబ్బిన మసాల వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి.
ఇందులో నానపెట్టిన బియ్యం వేసి ఒక నిమిషం పాటు ఉంచి కొబ్బరి పాలు పోసి ఉడికించాలి.
తరువాత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నటి మంట మీద పదినిమిషాల పాటు విజిల్‌ పెట్టకుండా ఉడికించాలి.
అంతే పులావ్‌ రెడీ.
వేడివేడి పులావ్‌ని ఉల్లిపాయ రైతాతో లేదా నచ్చిన ఇంకేదైనా రైతాతో తినొచ్చు.